schedule Sunday, July 05, 2026

కానిస్టేబుల్‌పై హత్యాయత్నం..!

calendar_today March 5, 2023
person dharshininews
కానిస్టేబుల్‌పై హత్యాయత్నం..!
కానిస్టేబుల్‌పై హత్యాయత్నం..! - దాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు - 80 రోజుల తరువాత కోర్టులో లొంగిన నిందితులు - రిమాండ్ చేసి జైలుకు పంపిన పోలీసులు - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ పై తండ్రీ, ఇద్దరు కొడులు హత్యాయత్నానికి యత్నించి దాడికి పాల్పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత కోర్టులో లొంగిపోవడంతో నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రాఘవేందర్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ 16వ తేదిన తాండూరుకు చెందిన బాతుల శ్రీను అతని కుమారులు బాతులు శ్రీకాంత్, బాతుల శ్రీధర్లు కానిస్టేబుల్ రాఘవేందర్ పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అదేవిధంగా దాడికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు అయిన సాక్ష్యాలను తొలగించే క్రమంలో సమీపంలో ఉన్న సురేందర్ రెడ్డికి చెందిన కారు షెడ్డును దహనం చేశారు. అప్పటి నుంచి జాతుల శ్రీను, అతని కుమారులు బాతుల శ్రీకాంత్, బాతుల శ్రీధర్‌లు పరారయ్యారు. కానిస్టేబుల్ పై హత్యాయత్నంతో పాటు షెడ్డును దహనం చేసిన ఘటనలలో నిందితులపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. 80 రోజుల తరువాత నిందితులు శనివారం కోడంగల్‌ న్యాయస్థానంలో లొంగిపోయారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులను రిమాండుకు ఆదేశించారు. ఈ మేరకు తండ్రీ, కొడుకులను రిమాండుకు తరలించినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.