schedule Saturday, November 21, 2026

పండ్లతో పాఠం.. కూరగాయలతో ఆరోగ్య సందేశం..!

calendar_today November 21, 2026
person dharshininews
పండ్లతో పాఠం.. కూరగాయలతో ఆరోగ్య సందేశం..!
పండ్లతో పాఠం.. కూరగాయలతో ఆరోగ్య సందేశం..! - కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌లో ఘనంగా ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ డే - పాటలు, నృత్యాలతో ఆకట్టుకున్న నర్సరీ, కేజీ చిన్నారులు - తల్లిదండ్రుల సృజనాత్మక ప్రదర్శనలకు ప్రశంసలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పండ్లు, కూరగాయల ఆకృతుల్లో తయారైన చిన్నారులు ఆరోగ్యా పాఠాలు చెబుతూ అదరహో అనిపించారు. ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడంతో పాటు పండ్లు, కూరగాయల పోషక విలువలను తెలియజేసే లక్ష్యంతో తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌లో శనివారం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా వేషాధారణలతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం నర్సరీ, జూనియర్‌ కేజీ, సీనియర్‌ కేజీ విద్యార్థులు స్వాగత గీతం, కూరగాయలపై రూపొందించిన పాటలు, పండ్ల నేపథ్యంతో నృత్య ప్రదర్శనలు నిర్వహించి అలరించారు. తాజా పండ్లు, కూరగాయలను నిత్యాహారంలో భాగం చేసుకోవాలని వివరించి.. ఆకట్టుకున్నారు. చిన్నారుల ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ప్రతిభను చూసి తల్లిదండ్రులు అభినందించారు. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు పండ్లు, కూరగాయలతో రూపొందించిన కళాత్మక ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ సృజనాత్మకతను చాటుతూ వారు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు చిన్నారులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తున్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్‌ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అన్నారు. తాజా పండ్లు, కూరగాయలను నిత్యాహారంలో భాగం చేసుకోవాలని, చిన్నతనం నుంచే మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత వంటి లక్షణాలను పెంపొందించేందుకు పాఠశాల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సతీష్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. https://www.dharshininews.com/45473/