schedule Wednesday, November 18, 2026

తాండూరు సమగ్రభివృద్ధికి మాస్టర్ ప్లాన్

calendar_today November 18, 2026
person dharshininews
తాండూరు సమగ్రభివృద్ధికి మాస్టర్ ప్లాన్
తాండూరు సమగ్రభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - భవిష్యత్తు తరాల కోసం ప్రణాళికలు - జోన్ల మార్పులతో ప్రజలకు మేలు - 32శాఖల అధికారులతో సమన్వయ చర్చలు - అందరి ఆమోదంతో అభివృద్ధికి కృషి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - పట్టణ ప్రముఖులతో అభిప్రాయ సేకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని హన్సా గ్రాండ్‌లో పట్టణంలో చేపట్టబోయే మాస్టర్‌ ప్లాన్‌పై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ పాలకవర్గం, ప్రజాప్ర తినిధులు, మేధావులు, పట్టణ ప్రముఖులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉపగ్రహ చిత్రాలతో రూపొందించిన పట్టణ మాస్టర్‌ ప్లాన్‌పై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌ చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డు ఇండస్ట్రీయల్‌ జోన్‌ మార్పుతో పాటు 19, 23వ వార్డు తదితర ప్రాంతాల్లోని స్థలాల ఇబ్బందుల పరిష్కారం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. జోనింగ్ సమస్య కారణంగా ఆయా కాలనీల ప్రజలు మున్సిపాలిటీ ద్వారా అందాల్సిన కొన్ని సౌకర్యాలు, అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.  మొత్తం 32 శాఖల సమన్వయంగా భవిష్యత్తు తరాలకు తగినట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో కూడా ఆయా ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. ఈసారి చేపట్టే మాస్టర్‌ ప్లాన్‌తో తాండూరును అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకోవడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరి నిర్ణయంతో జరిగేది కాదని, పట్టణ ప్రజలు, మేధావులు, నిపుణులు, ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు, సమిష్టి నిర్ణయాలతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తాండూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మాజీ చైర్మన్లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మీ, లక్ష్మారెడ్డి, విశ్వనాథ్‌ గౌడ్, ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి, జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, పట్టణ ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, మేధావులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45434/