schedule Wednesday, November 18, 2026

పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..!

calendar_today November 18, 2026
person dharshininews
పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..!
పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..! - కౌన్సిలర్‌ అరెస్ట్‌పై నేతల ఆగ్రహం - ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపాటు - జావిద్‌కు మద్దతుగా నిలిచిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డంకులు సృష్టించడం, నిరసన తెలిపితే కేసుల పేరుతో భయపెట్టడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్‌ను అరెస్ట్ చేయడంతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున గొంతు విప్పే నాయకులను అడ్డుకోవడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని అధికార పార్టీని ప్రశ్నించారు. తాండూరులోని 8వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కౌన్సిలర్‌ జావిద్‌ హాజరుకాకుండా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా తన వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో మాట్లాడినా, ప్రజా సమస్యలపై ప్రశ్నించినా, నిరసన తెలిపినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులను, ప్రజాప్రతినిధులను ఇలాగే అడ్డుకోలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులుగా అణచివేత ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో రాజకీయంగా పునరాగమనం చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలను, అధికారులను హెచ్చరించారు. https://www.dharshininews.com/45430/