schedule Saturday, November 14, 2026

వచ్చేది బీసీల రాజ్యమే..!

calendar_today November 14, 2026
person dharshininews
వచ్చేది బీసీల రాజ్యమే..!
వచ్చేది బీసీల రాజ్యమే..! - 2028 ఎన్నికల్లో 80 మంది బీసీ ఎమ్మెల్యేలే లక్ష్యం - అగ్రకుల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడుతాం - తాండూరు గడ్డపై బీసీ జెండా ఎగరేస్తాం - బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ - ఈడిగ శ్రీనివాస్‌ గౌడ్‌కు ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ రాజ్యమే.. అని, వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 80 మంది బీసీ ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు ఇకపై రాజకీయంగా వెనుకబడే ప్రసక్తే లేదని, ఓటు అనే ఆయుధంతో తమ హక్కులను సాధించుకుంటారని స్పష్టం చేశారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తాండూరు నియోజకవర్గం రెడ్డిగణపురం గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాస్ గౌడ్‌కు అభినందనగా శనివారం తాండూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విలేమున్ చౌరస్తా నుంచి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ వరకు సాగిన ర్యాలీలో బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చౌరస్తాలో జాజుల శ్రీనివాస్ గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్‌లకు ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీసీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా స్వల్ప జనాభా కలిగిన వర్గాలు అధికారాన్ని అనుభవిస్తుంటే, మెజారిటీగా ఉన్న బీసీలు మాత్రం రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ బీసీ రాజకీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేపట్టాలని, ఓబీసీ కాలమ్ అమలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు న్యాయమైన వాటా దక్కాలని డిమాండ్ చేశారు. 'ఓటు మనదే.. సీటు మనదే' నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ బిడ్డలను చట్టసభలకు పంపించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సగం అసెంబ్లీ స్థానాలను బీసీలు కైవసం చేసుకునేలా రాజకీయ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. తాండూరు బీసీలకు రాజకీయంగా కీలకమైన ప్రాంతమని పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించి బీసీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని రాజకీయ అడ్డంకులు ఎదురైనా బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మా, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, మాజీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు మురళీకృష్ణ, రాజుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహారాజ్, డాక్టర్ సంపత్ కుమార్, టీజేఎస్ కన్వీనర్ సోమశేఖర్, రిటైర్డ్ అదనపు ఎస్పీ మధుసూదన్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధులత, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, బంటు వేణు తదితరులు పాల్గొన్నారు. మర్యాద రామకృష్ణ సభాధ్యక్షత వహించగా, వందలాది మంది బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. https://www.dharshininews.com/45388/