schedule Friday, November 13, 2026

కోడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి

calendar_today November 13, 2026
person dharshininews
కోడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి
కోడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి - లక్ష్మీదేవిపల్లి, శివసాగర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం - సాగునీటి విషయంలో ప్రజాప్రతినిధులు మౌనం వీడాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఆ నియోజకవర్గానికి పరిమితం చేయరాదని, జిల్లా అంతటికి విస్తరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టులు లేక వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు ఎండిపోవడంతో రైతులు వర్షాధార పంటలైన కంది, పెసర, మినుములకే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. వర్షాలు కురిసినా నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ లేక వాగులపాలవుతోందని, రిజర్వాయర్లు నిర్మించి కృష్ణమ్మ జలాలను జిల్లాకు మళ్లిస్తేనే రైతుల కష్టాలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలకు అనుసంధానించాలని, పరిగి ప్రాంత రైతుల కోసం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను, తాండూరులో పెండింగ్‌లో ఉన్న శివసాగర్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాగారం వద్ద కాగ్నా నదిపై మన్నెకుచ్చల ప్రాజెక్టుతో పాటు చెక్‌డ్యామ్‌లు నిర్మించి, కర్ణాటక వైపు వృథాగా వెళ్తున్నట్లు పేర్కొన్న 4 టీఎంసీల నీటిని ఒడిసిపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు అన్యాయం జరిగిందని విమర్శించిన రమేష్ కుమార్, మార్పు కోరిన ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్‌పై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా రైతుల సాగునీటి సమస్యలపై చూపాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మౌనం వీడి జిల్లాకు నీళ్లు తీసుకురావాలని, లేనిపక్షంలో పార్టీలు, జెండాలకు అతీతంగా రైతులను ఏకం చేసి సాగునీటి కోసం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు నాగారం మల్లేశం, బంటారం భద్రేశ్వర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45378/