schedule Tuesday, November 03, 2026

ప్రైవేట్ ప్రచారానికి చెక్..!

calendar_today October 29, 2026
person dharshininews
ప్రైవేట్ ప్రచారానికి చెక్..!
ప్రైవేట్ ప్రచారానికి చెక్..! - ఆసుపత్రిల పబ్లిసిటీపై ఫోకస్ - జాతీయ వైద్య మండలి కొత్త ఆంక్షలు - రూల్స్ అతిక్రమిస్తే వేటు తప్పదు దర్శిని డెస్క్ : ప్రైవేటు ఆస్పత్రులకు ఇక ప్రచార పరీక్ష..! తమ ఆస్పత్రుల్లో అరుదైన చికిత్సలు చేశామని, క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని సోషల్‌ మీడియాలో హడావుడి చేసే ఆస్పత్రులకు నిబంధనల సెగ తగలనుంది. రోగులను ఆకర్షించేందుకు వైద్య సేవలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించడంపై జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు చర్చనీయాంశంగా మారాయి. వైద్య సేవల పేరుతో అతిశయోక్తి ప్రకటనలు చేస్తే ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాపై ఫోకస్ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా ఏ వేదిక చూసినా కొన్ని ఆస్పత్రుల చికిత్సల విజయగాథలు, ప్రత్యేక వైద్య సేవల ప్రచారమే కనిపిస్తోంది. అరుదైన కేసులకు చికిత్స చేశామంటూ పోస్టులు, శస్త్రచికిత్సల విజయాలను హైలెట్‌ చేస్తూ వీడియోలు, రోగులను ఆకర్షించే ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైద్య సేవల వివరాలను తెలియజేయడం వేరు.. వాటిని వాణిజ్య ప్రచారంగా మార్చడం వేరు. ఈ రెండింటి మధ్య గీత దాటితేనే సమస్యలు మొదలవుతాయన్న చర్చ సాగుతోంది. చిన్న ఆస్పత్రుల నుంచి కార్పొరేట్‌ వైద్య సంస్థల వరకు తమ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార మార్గాలను అనుసరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య నైతిక ప్రమాణాలు, ప్రకటనలపై నిబంధనల అమలు కీలకంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఆస్పత్రుల ప్రచార తీరుపై ఆసక్తి నెలకొంది. ఇకనైనా ప్రచారానికి కళ్లెం..? వైద్యం సేవా రంగమా? వ్యాపార ప్రచార వేదికనా? అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వస్తోంది. రోగులకు సరైన సమాచారం అందించడం, వైద్య సేవలపై అవగాహన కల్పించడం అవసరమే అయినా.. అతిశయోక్తులతో రోగులను ఆకర్షించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వైద్య ప్రకటనలపై నిబంధనలు ఎంత కఠినంగా అమలవుతాయి? ఉల్లంఘనలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. https://www.dharshininews.com/45214/