schedule Tuesday, November 03, 2026

టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..!

calendar_today October 28, 2026
person dharshininews
టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..!
టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..! - పబ్లిక్ పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల - అక్టోబర్‌ 30 నుంచి చెల్లింపులు ప్రారంభం - గడువు చివరి తేది ఇదే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కందిమళ్ల లింగయ్య ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి, ఆలస్య రుసుముల భారం పడకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లింపునకు గడువులు ఇవే.. పదో తరగతి పరీక్షలకు సాధారణ ఫీజు రూ.125గా నిర్ణయించారు. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత అదనపు రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్‌ 30 – నవంబర్‌ 16: రూ.125 సాధారణ ఫీజు నవంబర్‌ 18 – డిసెంబర్‌ 1: రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 3 – డిసెంబర్‌ 14: రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 16 – డిసెంబర్‌ 28: రూ.500 ఆలస్య రుసుముతో అర్హులైన విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితుల ఆధారంగా రూ.125 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభించనుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20,000లోపు, పట్టణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.24,000లోపు ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి ఫీజు మినహాయింపు పొందవచ్చు. పాఠశాలల ద్వారానే ఫీజు చెల్లింపులు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తి చేయాల్సి ఉంటుంది. బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి చెల్లింపులు నిర్వహించాలి. విద్యార్థులు తమ ఫీజు వివరాలు, మినహాయింపు అర్హతల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. సాధారణ ఫీజుతో చెల్లించేందుకు నవంబర్‌ 16 చివరి తేదీ కావడంతో విద్యార్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. https://www.dharshininews.com/45209/