schedule Tuesday, November 03, 2026

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

calendar_today October 27, 2026
person dharshininews
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - జూనియర్‌ సివిల్‌ జడ్జి గిరిజ తిరందాసు - ప్రభుత్వ నంబర్‌-1 పాఠశాలలో ‘సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌’ కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి గిరిజ తిరందాసు సూచించారు. బాలల హక్కులను తెలుసుకోవడంతో పాటు వాటికి భంగం కలిగినప్పుడు చట్టపరంగా ఎలా రక్షణ పొందవచ్చో ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం తాండూరు మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నంబర్‌-1 పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి గిరిజ తిరందాసు మాట్లాడుతూ.. బాలల రక్షణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా పోక్సో చట్టం, విద్యాహక్కు చట్టం, బాల్యవివాహాల నిర్మూలన, బాలల హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. బాలలపై జరిగే నేరాలను అరికట్టడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం కోసం చట్టాలు కల్పిస్తున్న రక్షణ గురించి వివరించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తగిన సహాయం పొందేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే. శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్‌, ప్యానల్‌ న్యాయవాదులు జిలాని, టీ. అరుణ, ఏ. పరమేశ్వరి, మస్తాన్‌, దేవ్‌రాజ్‌, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్‌, అబ్దుల్‌ రెహమాన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45201/