రక్తపు మడుగులో బాలిక
October 25, 2022
dharshininews
రక్తపు మడుగులో బాలిక
- సాయం కోరుతుంటే వీడియో తీశారు
- లేటైనా స్పందించిన పోలీసు అధికారి
- నెట్టింట్లో వీడియో వైరల్
దర్శిని డెస్క్ : ఆపదలో చేయి సాచే వారికి సాయం చేయాల్సిన పరిస్థితులు పోయి సాయం చేసే ఆలోచనను పక్కన పెట్టి చేతిలో ఉన్న ఫోన్‌లో వీడియో తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి మన దేశంలో. మానవత్వం నశించి పోతుందనే దానికి ఎన్నో సంఘటనలు రోజుకు ఒకటైనా కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అలాంటి అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చర్చనీయాంశం అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక ప్రభుత్వ గెస్ట్‌హౌస్ పక్కన ఓ 13 ఏళ్ల బాలిక రక్తగాయాలతో పడివుంది. తలకు తీవ్రమైన గాయాలతో ఒళ్లంతా రక్తపు మరకలతో చిన్నారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. కానీ,ఇంత జరిగినా అక్కడి జనం మాత్రం చోద్యం చూస్తున్నట్టుగా ప్రవర్తించారు. రక్తపు మడుగులో పడివున్న బాలికను స్థానికులు వీడియో తీశారు. సాయం కోసం బాలిక అర్థిస్తున్నా పట్టించుకోకుండా.. వీడియో రికార్డింగ్‌లో పోటీపడ్డారు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. కనీసం పోలీసులకు సైతం ఫోన్ చేయాలనే ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. లేటైనా కూడ విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఓ పోలీసు అధికారి వెంటనే స్పందించి హుటా హుటినా ఆ బాలికను చేతులపై ఎత్తుకుని ఆటోవైపు పరుగెత్తాడు. ఆటోలో వేసుకుని ఆస్పత్రికి తరలించాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ప్రకారం పోలీసులు వచ్చే వరకు బాధితురాలికి ఎవరూ సాయం చేయలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికను చికిత్స కోసం కాన్పూర్‌కు తరలించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొబైల్‌లో వీడియోలు తీస్తున్నవారిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాయం చేసిన పోలీసులకు సెల్యూట్ అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://twitter.com/i/status/1584760198345809920