schedule Friday, September 04, 2026

కుర్చీ ఉత్కంఠకు తెర..!

calendar_today December 5, 2023
person dharshininews
కుర్చీ ఉత్కంఠకు తెర..!
కుర్చీ ఉత్కంఠకు తెర..! - తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి - 7వ తేదిన ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటివరకు సస్పెన్స్‌ కొనసాగింది. సోమవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధిష్ఠానానికి చేరవేశారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 7న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖరారైనప్పటికి రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణపై కూడా కసరత్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22420/