schedule Thursday, September 03, 2026

నిషేధిత భూముల యజమానులకు ఊరట..!

calendar_today August 14, 2026
person dharshininews
నిషేధిత భూముల యజమానులకు ఊరట..!
నిషేధిత భూముల యజమానులకు ఊరట..! - 22ఏ భూముల చెరకు తెర - 45 రోజుల్లోనే పరిష్కారంకు కసరత్తు - అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏళ్లుగా వివాదాల్లో చిక్కుకుని, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూముల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 22ఏ జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేపట్టి, వాస్తవ పరిస్థితులను గుర్తించనున్నారు. అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం, అనర్హమైన వాటిని కొనసాగించడం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 22ఏ భూముల అంశం వేలాది కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. భూములు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకపోవడంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదాలకు కూడా పరిష్కారం లభించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి, సమస్యాత్మక భూములను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో 22ఏ భూముల సమస్యకు త్వరలోనే తెరపడుతుందన్న ఆశలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి. https://www.dharshininews.com/44193/