schedule Thursday, September 03, 2026

ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..!

calendar_today August 6, 2026
person dharshininews
ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..!
ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..! - రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన వ్యక్తిని కాపాడిన డయల్–100 పోలీసులు - యాలాల కానిస్టేబుళ్ళ సమయ స్ఫూర్తి - అభినందించిన ఎస్ఐ విఠల్ రెడ్డి యాలాల, దర్శిని ప్రతినిధి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి 100కు చేసిన ఫోన్ కాల్ కు కానిస్టేబుళ్ళు స్పందించి అతని నిండు ప్రాణాన్ని కాపాడారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కేవలం ఐదు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు తీసుకోవాలని యత్నించిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన పోలీసుల విధి నిర్వహణలోని నిబద్ధతకు, మానవత్వానికి అద్దం పట్టింది. కోకట్ గ్రామానికి చెందిన షేక్ పాషా అప్పుల భారంతో తీవ్ర మనోవేదనకు గురై రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో డయల్–100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. సమాచారం అందుకున్న డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాల్ లొకేషన్‌ను గుర్తించి వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్ వద్ద ఉన్న షేక్ పాషాను గుర్తించిన పోలీసులు అతనితో ఓర్పుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చి అతని ప్రాణాలను కాపాడారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో ఒక నిండు ప్రాణం నిలవడమే కాకుండా, ఓ కుటుంబంలో తీవ్ర విషాదం తప్పిందని స్థానికులు అభినందించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, మానవత్వం, సేవాభావాన్ని చాటిన కానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్‌ను యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. https://www.dharshininews.com/44058/