schedule Thursday, September 03, 2026

బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..!

calendar_today August 3, 2026
person dharshininews
బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..!
బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..! - జనన, మరణాల నమోదులో కీలక మార్పులు - సవరణ బిల్లులో కొత్త రూల్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: జననాలు, మరణాల ఆలస్య నమోదుపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. లోక్‌సభ ఆమోదించిన జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026 ప్రకారం, జననం లేదా మరణం జరిగి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) అనుమతి తప్పనిసరి. ఇప్పటి వరకు స్థానిక రిజిస్ట్రార్ లేదా రెవెన్యూ అధికారుల అనుమతితో ఆలస్య నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనలతో ఇక రెండేళ్లు దాటిన నమోదుకు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో నేరుగా దరఖాస్తు చేయలేరు. ముందుగా కోర్టు ఉత్తర్వులు పొందిన తర్వాతే నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సవరణ బిల్లులో పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)-1973 స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)-2023 నిబంధనలను చేర్చారు. దీని ద్వారా నకిలీ ధృవపత్రాల జారీకి అడ్డుకట్ట పడటంతో పాటు పౌరుల వివరాల భద్రత, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్ ద్వారా రికార్డుల నిర్వహణ కూడా సులభతరం కానుంది. ఏం చేయాలంటే.. రెండేళ్లు దాటిన నమోదుకు ముందుగా స్థానిక కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఆసుపత్రి రికార్డులు, పాఠశాల ధృవీకరణ పత్రాలు లేదా నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసు లేదా రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహిస్తారు. అనంతరం కోర్టు ఉత్తర్వులతో మున్సిపాలిటీ లేదా గ్రామ సచివాలయంలో డిజిటల్ జనన లేదా మరణ ధృవపత్రం పొందవచ్చు. అయితే జననం లేదా మరణం జరిగిన రెండేళ్లలోపు నమోదు చేసుకునే వారికి కోర్టు అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోనే స్థానిక అధికారుల వద్ద నమోదు పూర్తి చేసుకోవచ్చు. https://www.dharshininews.com/44020/