schedule Thursday, September 03, 2026

ప్రజల భద్రతతో చెలగాటం..!

calendar_today August 2, 2026
person dharshininews
ప్రజల భద్రతతో చెలగాటం..!
ప్రజల భద్రతతో చెలగాటం..! - రోడ్లు, విద్యుత్ వ్యవస్థల నిర్లక్ష్యంతో ప్రమాదాలు - ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలు వెంటనే స్పందించాలి - బీఆర్ఎస్ యువనేత సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజల ప్రాణ భద్రతను విస్మరిస్తూ ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలు వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ పట్టణ యువనేత సంతోష్ గౌడ్ ఆరోపించారు. ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తాండూరులో విద్యుత్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ వెంటనే తనిఖీలు నిర్వహించి లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూరు పరిసర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో తవ్విన గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళలు ప్రమాదానికి గురై గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే తాండూరు–కొడంగల్ ప్రధాన రహదారిపై తవ్విన గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇటీవల ఇదే రహదారిపై గుంతలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జరిగినప్పటికీ సంబంధిత శాఖలు పాఠాలు నేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఇకనైనా చొరవ చూపాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంతోష్ గౌడ్ హెచ్చరించారు. https://www.dharshininews.com/44001/