schedule Thursday, September 03, 2026

సెల్యూట్ ఓ సైనికా..!

calendar_today July 26, 2026
person dharshininews
సెల్యూట్ ఓ సైనికా..!
సెల్యూట్ ఓ సైనికా..! - కార్గిల్ వీరుడు అమీనుల్లా ఖాన్‌ - 28 ఏండ్ల పాటు దేశం కోసం సేవలు - సుబేదార్ మేజర్‌గా కీర్తి, ప్రతిష్టలు - తాండూరు సైనికుడిపై ప్రత్యేక కథనం తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశం కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్న వేళ, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన భారత సైన్య మాజీ అధికారి గౌరవ సుబేదార్ మేజర్ (రిటైర్డ్) అమీనుల్లా ఖాన్ సేవలను స్థానికులు గర్వంగా స్మరించుకుంటున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో విధులు నిర్వహిస్తూ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన, తాండూరు పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. అమీనుల్లా ఖాన్ 1979 ఫిబ్రవరి 10న భారత సైన్యంలో చేరారు. నాగ్‌పూర్‌లో శిక్షణ పూర్తి చేసిన అనంతరం 6వ బెటాలియన్ గార్డ్స్ రెజిమెంట్‌లో నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి పోస్టింగ్‌తో ప్రారంభమైన ఆయన సైనిక జీవితం దాదాపు 28 సంవత్సరాల పాటు దేశ సేవకే అంకితమైంది. తన సేవా కాలంలో అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, లేహ్–లడఖ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ వంటి కీలక ప్రాంతాలతో పాటు శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళం (IPKF)లో కూడా సేవలందించారు. దేశ భద్రతకు సంబంధించిన అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. సైనిక జీవితంలో కర్ణాటకలోని బెల్గాంలో ప్రతిష్ఠాత్మక కమాండో శిక్షణను పూర్తి చేసి తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితభావం, దేశభక్తితో ఆయన సహచరుల ప్రశంసలు అందుకున్నారు. 2007 మార్చి 1న సుబేదార్ హోదాలో పదవీ విరమణ చేసిన అమీనుల్లా ఖాన్‌కు విశిష్ట సేవలకు గుర్తింపుగా అనంతరం గౌరవ సుబేదార్ మేజర్ హోదా ప్రదానం చేయబడింది. ప్రస్తుతం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఆయన యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు, భారత సైన్యంలో చేరాలనే స్ఫూర్తిని కలిగించేందుకు తన అనుభవాలను పంచుకుంటూ ఆదర్శప్రాయ జీవితం గడుపుతున్నారు. https://www.dharshininews.com/43921/