schedule Friday, September 04, 2026

జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..!

calendar_today June 25, 2026
person dharshininews
జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..!
జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..! - సేవలను మారిస్తే ఉద్యమం చేపడుతాం - వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తాండూరు ప్రజలకు దాదాపు రెండు దశాబ్దాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పేదలకు ప్రాణాధారంగా నిలిచిన జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. ఇటీవల ఈ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలోని బోధనాసుపత్రిగా మారుస్తున్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలు ప్రజల్లో అనేక సందేహాలకు దారితీస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా పేదలు, రైతులు, కార్మికులు, వృద్ధులు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. అలాంటి ఆసుపత్రి భవిష్యత్తుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను వెంటనే నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ పరిణామాలపై స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఆరోగ్య హక్కులకు భంగం కలిగించే విధంగా జిల్లా ఆసుపత్రి సేవలు తగ్గించే ప్రయత్నం జరిగినా, లేదా తాండూరు ప్రజలకు నష్టం కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అన్ని ప్రజాసంఘాలు, రాజకీయాలకు అతీతంగా తాండూరు ప్రజలతో కలిసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. https://www.dharshininews.com/43605/