schedule Saturday, September 05, 2026

కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..!

calendar_today March 26, 2026
person dharshininews
కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..!
కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..! - 40కేజీలు పట్టుకుంటే 600కేజీలు స్వాదీనం - కర్ణాటకలో తయారు.. తాండూరులో విక్రయాలు - గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు - అదుపులోకి వాహనం, ఇద్దరు నిందితులు - వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర తాండూరు, దర్శిని ప్రతినిధి : కల్తీ అల్లం పేస్టు విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. 40కేజీల కల్తీ అల్లం పట్టుకుంటే విచారణలో 600కేజీలను స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు పట్టణం పాత కూరగాయల మార్కెట్‌లో రేపాల శ్రీధర్ అనే వ్యాపారి కల్తీ అల్లం విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇనుస్పెక్టర్ అన్వర్ పాష బృందం దాడులు నిర్వహించారు. వ్యాపారి నుంచి 40 కేజీల కల్తీ అల్లం స్వాదీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకవస్తున్నారని విచారించగా కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన యర్రమల్లి గిరిధర్ అనే వ్యక్తి తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే బీదర్‌లోని అతని హోల్‌సేల్ షాపుపై దాడి చేసి, అక్కడ నిల్వ ఉంచిన మరో 560 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. వారితో పాటు కల్తీ అల్లం రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని(KA 39 9028) కూడా సీజ్ చేశారు. ఈ మేరకు నిందితులు యర్రమల్లి గిరిధర్ (తయారీదారు, బీదర్), రేపాల శ్రీధర్ (విక్రేత, తాండూరు)లపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ, లాభార్జనే ధ్యేయంగా కల్తీ పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. https://www.dharshininews.com/42804/