schedule Thursday, September 10, 2026

బరితెగించిన దొంగలు..!

calendar_today February 8, 2025
person dharshininews
బరితెగించిన దొంగలు..!
బరితెగించిన దొంగలు..! - చోరి కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం - సుమారు 17 తులాల బంగారం, రూ. 5లక్షల నగదు చోరీ - తాండూరు పట్టణం పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గుర్తుతెలియని దొంగలు బరితెగించారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన బస్వరాజ్ గౌడ్ ప్రజాతంత్ర పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అంగన్ వాడి టీచర్ గా పనిచేస్తున్నారు. శనివారం ఎవరి విధులకు వారు వెళ్లారు. అదే సమయంలో పట్టణంలో సాయిపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని బస్వరాజ్ కవరేజీ కోసం వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చూసే సరికి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా తమ బందువులకు చెందిన సుమారు 7 తులాల బంగారం, వారికి చెందిన మరో 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీంతో పాటు బందువులు ఇంట్లో దాచుకున్న రూ. 2లక్షలకు, వారికి చెందిన చీటీ డబ్బులు మరో రూ. 3లక్షలు మొత్తం రూ. 5లక్షల వరకు దొంగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపడంతో విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్ లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. పట్టణంలో ఉదయం, మధ్యాహ్నం మరో చోరీ జరగడంతో పట్టణంలో వరస చోరీలు చర్చనీయాంశంగా మారాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32944/