schedule Sunday, July 05, 2026

దొంగలకు సాయం చేస్తున్న బీజేపీ

calendar_today December 26, 2022
person dharshininews
దొంగలకు సాయం చేస్తున్న బీజేపీ
దొంగలకు సాయం చేస్తున్న బీజేపీ - ఎర కేసు సీబీఐకీ బదిలీ కుట్రలో భాగమే - నేనేం తప్పుచేయలేదు.. భయపడేది లేదు - ఈడీ విచారణపై హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ - బీజేపీ కుట్రను ఎదుర్కొనేందుకు కార్యాచరణ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దొంగలకు బీజేపీ సంబంధం లేదంంటూనే సాయం చేస్తుందని బీఆర్ఎస్‌ ఎమ్మె ల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. సిట్‌ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయడం బీజేపీ కుట్రలో భాగమేనని అన్నారు. సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ఎర కేసులో పిర్యాదు దారునిగా ఉన్నందుకే ఈడీ విచారించిందని.. వారి పరిధిలోకి ఆ అంశం లేకున్నా నన్ను విచారించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తనను విచారించినప్పుడు ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదని, అందుకే సీబీఐని రంగంలోకి దించారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. సిట్‌ లేదా సీబీఐతో విచారణ చేయించాలని తొలుత నిందితులే కోరారని, సిట్‌లో సీనియర్‌ పోలీసు అధికారులను నియమించారని తెలిపారు. ఈ కేసులోని వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన భాజపా నేతలు, నిందితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని వారు విచారణకు రావడం లేదు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం. తప్పు చేయనప్పుడు మాకు భయం అవసరం లేదు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రాలేదని.. ఆ కాపీ చూసిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈడీ విచారణపై ఇవాళ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాం. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించాలని.. కావాలనే నన్ను ఈడీ అధికారులతో వేధించారని అన్నారు. తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. ఈడీ విచారణకు హాజరయ్యా, అవసరమైతే సీబీఐ విచారణకు వెళ్తానని తెలిపారు. జైలుకు పంపినా వెళ్లేందుకు సిద్ధమే అని అన్నారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసముందని చివరకు న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు.