ఆసరాకు నేడే ఆఖరు గడువు
August 31, 2021
dharshininews
ఆసరాకు నేడే ఆఖరు గడువు
- పైసా లేకుండా మీ సేవాలో దరఖాస్తుకు అవకాశం
- లబ్దిదారులు త్వరపడాలని అధికారుల సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు ప్రతి నెలా ఫించన్లు అందజేస్తూ అండగా నిలుస్తోంది. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకే ఫించన్ అందించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆసరా వృద్ధాప్య ఫించన్ ధరఖాస్తులకు నేటితో గడువు తీరబోతోంది. పైసా ఖర్చులేకుండా మీ సేవాల ద్వారా లబ్దిదారులు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఓటరు కార్డు ఆధారంగా ఫించన్ల దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే తాండూరు మున్సిపల్‌లో దాదాపు 6400 మంది ఆసరా ఫించన్లు ఉండగా ఇందులో వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ, గీతా, బీడీ కార్మికుల కింద ఆసరా ఫించన్ పొందుతున్నారు. తాజాగా 57 ఏండ్ల వృద్ధాప్య పించన్ల దరఖాస్తులతో తాండూరులో లబ్దిదారుల సంఖ్య మరింత పెరగబోతోంది. మరోవైపు 57 ఏండ్లు నిండిన వారు ఆసరా ఫించన్ కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో తీరిపోతుందని, లబ్దిదారులు త్వరపడి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.