schedule Thursday, September 03, 2026

మహిళ సంఘాలకు కొత్త స్కీం..!

calendar_today December 23, 2025
person dharshininews
మహిళ సంఘాలకు కొత్త స్కీం..!
మహిళ సంఘాలకు కొత్త స్కీం..! - మండలానికి ఒకరికి, మున్సిపల్‌లో ఇద్దరకి - ఖర్చులు, దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కొత్త పథకం తీసుకరాబోతోంది. మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి మండలానికి ఒక విజయ డెయిరీ పార్లర్‌ను మహిళా సంఘానికి కేటాయించనున్నారు. అదే విధంగా మున్సిపాలిటీల్లో అయితే రెండు పార్లర్లు చొప్పున మహిళలకు అందించేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను వారం నుంచి పది రోజులలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లర్లలో విజయ డెయిరీకి చెందిన ఉత్పత్తులనే విక్రయించాల్సి ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్, మజ్జిగ, అలాగే తాగునీటి బాటిళ్లు వంటి ఉత్పత్తులను విజయ డెయిరీ సంస్థే సరఫరా చేస్తుంది. విక్రయాల ద్వారా వచ్చే లాభం పూర్తిగా మహిళా సంఘాలకే దక్కనుంది. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, సంఘాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనుంది. ఖర్చులు.. దరఖాస్తు విధానం ఇలా విజయ డెయిరీ పార్లర్‌ను పొందాలనుకునే మహిళా సంఘాలు ముందుగా పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్యకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత పార్లర్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని మహిళా సంఘాలే గుర్తించుకోవాలి. ఆ తర్వాత రూ.5,000 చెల్లిస్తే అధికారికంగా పార్లర్ మంజూరు చేస్తారు. ఒక్కో విజయ డెయిరీ పార్లర్ ఏర్పాటుకు సగటున రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని మహిళలపై వేయకుండా ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైన లోన్లను మహిళా సంఘాలకు అందించి, వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందించనుంది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40165/