అమాయకులను జైల్లో పెట్టారు..!
November 25, 2024
dharshininews
అమాయకులను జైల్లో పెట్టారు..!
- వారి విడుదలకు ప్రయత్నిస్తాం
- కర్కశత్వంగా పోలీసుల తీరు
- అధికారులపై దాడి సరైంది కాదు
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అమాయకులను జైల్లో పెట్టారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం కమీషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లెల శంకర్, నీలాదేవి లతో కలిసి లగచర్లలో పర్యటించారు. అనంతరం ఘటనలో అరెస్టయిన 24 మందిని సంగారెడ్డి జైల్లో కలిశారు. అంతకుముందు గిరిజనులతో భేటి అయ్యి లగచర్ల, రోటిబండ తండాలో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడుతూ... జరిగిన సంఘటన దూరదృష్టకరమని, తమ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అధికారుల పై తిరగబడడం సరిఅయిన విధానం కాదని అన్నారు. సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
సంఘటనలో లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రజలు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా... ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పి దృష్టికి తీసుకు వెళ్తానని ఎవరు అధైర్య పడకూడదని భరోసా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని, మీ బాధలు, సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూ సేకరణ చేపడుతుందని, బలవంతంగా భూసేకరణకు పూనుకోదని అన్నారు.
మరోవైపు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లిన ఆయన అరెస్టు అయిన వారితో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఛైర్మన్ వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల కేసులో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వివరిస్తామన్నారు. ‘‘ఈ కేసులో అమాయకులను విడుదల చేయాలని సీఎంను కోరతాం. ఇప్పటికీ గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో అమాయకులను జైల్లో పెట్టారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. కలెక్టర్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని అన్నారు. చైర్మన్ తో పాటు ఎస్సి వెల్ఫేర్ అధికారి మల్లేశం, సంబంధిత అధికారులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30823/