మూడు రోజులు వర్షాలు..!
April 15, 2023
dharshininews
మూడు రోజులు వర్షాలు..!
- వడగండ్లు కురిసే అవకాశం
- జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ వడగండ్ల వర్షం పడే అవకాశం కూడ ఉందని స్పష్టం చేసింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావతంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం..వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక ద్రోణి ప్రభావతంతో ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. దీంతో పాటు పలు చోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది వాతగావరణ శాఖ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పగటిపూట ఉష్ణోగ్రతలు 34-38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనూ పలు చోట్ల వర్షం ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.