schedule Sunday, September 06, 2026

పల్లె వైద్యానికి భరోసా

calendar_today December 8, 2022
person dharshininews
పల్లె వైద్యానికి భరోసా
పల్లె వైద్యానికి భరోసా - కొత్త వైద్యులను నియమిస్తున్న సర్కారు - పల్లె దవాఖానలలో డాక్టర్ల పోస్టుల భర్తి - 1492 పోస్టులకు జీఓ జారీ చేసిన ఆర్ధిక శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందుకు భరోసా కల్పించే విధంగా పల్లె దవాఖానలలో వైద్య పోస్టులను భర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసిన సర్కారు ఇక పల్లె దవాఖానలలో మెరుగైన సేవలను అందించేలా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4745 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లు ఉండగా, ఇందులో 3206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఇందులో భాగంగా ఈ పల్లె దవాఖానాల్లో 1492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది. దీనిలో భాగంగా వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. 3206 సబ్ సెంటర్లలో కూడా ఇకపై వైద్యులు.. రాష్ట్రంలోని 3206 సబ్ సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్‌ సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్ సెంటర్లలో డాక్టర్‌ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక నుండి పల్లె ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల వద్దకే వైద్య సేవలు అందించనున్నాయి. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్దాసుపత్రులకు వెళ్లడం తప్ప , పల్లెల సుస్తిని ఇక పల్లె దవాఖనాలే పొగొట్టనున్నాయి. పల్లె దవాఖానాలలో వైద్య సేవలు తీరు పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్థరణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని టీ డయాగ్నస్టిక్స్ కు పంపుతారు. అక్కడి నుండి వచ్చిన వ్యాధి నిర్థరణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాధమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్ సీ లేదా ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.