schedule Sunday, September 06, 2026

రేషన్ అనర్హుల ఏరివేత

calendar_today November 10, 2022
person dharshininews
రేషన్ అనర్హుల ఏరివేత
రేషన్ అనర్హుల ఏరివేత - రంగం సిద్దం చేస్తున్న కేంద్రం - ఎవరివి తొలగిస్తారంటే.. దర్శిని డెస్క్‌: దేశంలో పేద ప్రజలకు అమలు చేస్తున్న రేషన్ పథకంలో అనర్హులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది రేషన్‌ అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించింది. ఈ మేరకు అనర్హులను తొలగించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత రేషన్ కార్డును పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో నకిలీ రేషన్‌ కార్డులు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా 10 లక్షల నకిలీ రేషన్ కార్డులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. ఈ రేషన్ కార్డులు త్వరలో రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా అనర్హుల జాబితాను సిద్దం చేసి పంపించాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ డీలర్లు అందించే నివేధికల ఆధారంగా అనర్హుల పేర్లను గుర్తించి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపడం జరుగుతుందని, ఆ తర్వాత వారి కార్డులు రద్దు చేయబడతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) వివరాల ప్రకారం.. ఆదాయపు పన్ను చెల్లించే కార్డ్ హోల్డర్లు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అలాంటి వారు రేషన్ కార్డు కలిగివుంటే రద్దు చేయనున్నారు. గత 4 నెలలుగా ఉచిత రేషన్ తీసుకోని వారు, అదే సమయంలో, ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించారు. నకీలీ రేషన్‌ కార్డులను తొలగిస్తే ఇకపై ఉచిత గోధుమలు, శనగలు, బియ్యం ప్రయోజనం పొందలేరు. నకిలీ రేషన్ కార్డులు కలిగివున్నవారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.