schedule Sunday, September 06, 2026

ధాన్యం రైతులకు శుభవార్త

calendar_today October 26, 2022
person dharshininews
ధాన్యం రైతులకు శుభవార్త
ధాన్యం రైతులకు శుభవార్త - వానాకాలం బియ్యం సమర్పణకు గడువు పెంపు - ప్రకటించిన మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యం రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు గడువు పొడిగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర సీఎంఆర్ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించిందని తెలిపారు. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు.. ఈ నవంబర్ 30 వరకు ఎఫ్సీఐ గడువును పెంచిందని గంగుల తెలిపారు. దీంతోపాటు గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అంతేకాకుండా గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. దాదాపు 7,100కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే మరో వందవరకు ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని తెలిపారు. అందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే సమకూర్చారని చెప్పారు.