schedule Monday, September 07, 2026

ఇంటి వ‌ద్ద నుంచే ఆధార్ సేవ‌లు

calendar_today June 14, 2022
person dharshininews
ఇంటి వ‌ద్ద నుంచే ఆధార్ సేవ‌లు
ఇంటి వ‌ద్ద నుంచే ఆధార్ సేవ‌లు - త్వ‌ర‌లోనే అందుబాటులోకి - క‌స‌ర‌స్తు చేస్తున్న యూఐడీఏఐ ద‌ర్శిని డెస్క్‌: దేశంలో పౌరులందరికీ ఆధార్ కార్డు సేవ‌లు సుల‌భ‌త‌రం కాబోతున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో ఏదైనా మార్పు కోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. మీ ఇంటి వద్దకే ఈ సేవను అందించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వేగంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ సదుపాయం అమలులోకి వచ్చిన వెంటనే.. మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, చిరునామా మార్చుకోవటం లాంటి మరిన్ని అప్‌డేట్‌లను పొందగలుగుతారు. ప్రస్తుతం మీరు ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే.. మీరు తప్పక ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. UIDAI కొత్తగా తెస్తున్న పథకం అమలు చేయబడితే.. ఈ సేవలను పొందేందుకు మీరు ఇకపై ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లనక్కర్లేదు. ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు.. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 48,000 పోస్ట్‌మ్యాన్లకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరి ద్వారా ఇంటి వద్ద కూర్చొని ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చు. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. తపాలా శాఖకు చెందిన పోస్ట్‌మ్యాన్‌ సహకారంతో ఇది కార్యరూపం దాల్చనుంది. దీని కింద దాదాపు 1.5 లక్షల మంది పోస్టాఫీసు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీని తర్వాత.. ఏ వ్యక్తి అయినా ఆధార్‌కు సంబంధించిన అన్ని పనులను ఇంట్లో కూర్చొని పూర్తి చేయగలుగుతారు. పోస్ట్‌మ్యాన్‌కు శిక్షణతో పాటుగా ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని సౌకర్యాలను UIDAI అందజేస్తుంది. దీంతో రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి.