schedule Saturday, July 04, 2026

అమ్మాయిలకు సర్కారు కానుక..!

calendar_today March 11, 2026
person dharshininews
అమ్మాయిలకు సర్కారు కానుక..!
అమ్మాయిలకు సర్కారు కానుక..! - త్వరలో ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ - బడ్జెట్‌లో కోట్ల నిధుల కేటాయింపుకు సిద్దం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే అమ్మాయిలకు సర్కారు కానుక అందించబోతోంది. త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను అందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలు, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులను ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించే అవకాశం ఉంది. విద్యార్థినులపై రోజువారీ పెట్రోల్ ఖర్చు భారం పడకుండా ఉండటమే కాకుండా, పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ వాహనాలను ఎంపిక చేశారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలపై కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం బేసిక్ మోడళ్ల ధరలు రూ.60 వేల నుంచి ప్రారంభమవుతున్నా.. క్వాలిటీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని.. మంచి బ్రాండెడ్ స్కూటీలను ఎంపిక చేసే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటీల ధరలు సాధారణంగా రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్నాయి. ఈ స్కూటీల కొనుగోలుకు టెండర్ ప్రక్రియలో ప్రత్యేక నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. బ్యాటరీపై వారంటీ, కనీసం మూడు సంవత్సరాల సర్వీసింగ్ వంటి అంశాలను కూడా కంపెనీల బాధ్యతగా పెట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఈ పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ.1,600 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసినట్టు సమాచారం. రానున్న వార్షిక బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశలవారీగా స్కూటీల పంపిణీ చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. https://www.dharshininews.com/42401/