schedule Monday, September 07, 2026

ఎమ్మెల్యేల ఎరపై సిట్‌

calendar_today November 9, 2022
person dharshininews
ఎమ్మెల్యేల ఎరపై సిట్‌
ఎమ్మెల్యేల ఎరపై సిట్‌ - ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న సర్కారు - సీపీ సీవి ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: దేశ రాజకీయాలలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఎర కేసు విచారణను వేగవంతం చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం కూడ తీసుకుంది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ దీనికి సిట్‌ అనే పేరుతో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టబోతోంది. ఈ బృంతంలో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జదీశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మీనారాయణ సిట్‌లో సభ్యులుగా నియమించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ మొయినాబాద్‌ పోలీసులు విచారణ చేపట్టాలని హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాలన్న అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక బృందం ఎమ్మెల్యేల కొనుగోలులో రూ. 100 కోట్ల విషయంతోపాటు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయన్న కోణంలోనూ దర్యాప్తు చేయబోతున్నట్లు సమాచారం.