schedule Monday, September 07, 2026

భద్రాచలంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

calendar_today July 17, 2022
person dharshininews
భద్రాచలంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
భద్రాచలంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ - గోదావ‌రి నదికి ప్ర‌త్యేక పూజ‌లు - వ‌ర‌ధ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన సీఎం - రూ. 10వేలు, రెండు నెలలకు 25 కిలోల బియ్యం హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హెలీకాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసి, కరకట్టను పరిశీలించారు. అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం శ్రీ కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు. బాధితులను పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం శ్రీ కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వరదలు వచ్చిన ప్రతిసారీ భద్రాచలం ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం పట్టణ వాసుల కన్నీళ్లను తుడిచేందుకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరద చేరని, అనువైన ఎత్తైన ప్రదేశాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కాలనీల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ముంపునుంది తమకు శాశ్వత ఉపశమనం దొరకుతుండటంతో వరద బాధితులు హర్షం వ్యక్తం చేశారు. మ‌రోవైపు వరద బాధితులకు పునరావాస కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.